: షూ కనిపించలేదట... కేసు పెట్టాడు... ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని, బయటకు వచ్చాడు. ఎంతో సేపు వెతికాడు... అయినా అతని బూట్లు కనిపించలేదు. కొత్తగా కొన్న తన బూట్లను ఎవరో ఎత్తుకుపోయారని గ్రహించిన అతడికి ఒళ్లు మండిపోయింది. దీంతో, పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కొత్త బూట్లు పోయాయని కేసు పెట్టాడు. విచిత్రంగా ఉన్నా, ఇది నిజం. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కేసు పెట్టిన వ్యక్తి పేరు అన్షల్ గుప్తా. కాన్పూర్ కు చెందిన ఇతను తన కుటుంబ సభ్యులతో కలసి ప్రముఖ కాకాజీ దేవాలయానికి వచ్చాడు. ఆ సందర్భంలోనే, పైన చెప్పిన ఘటన అంతా జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.