: హైకోర్టు విభజనలో మీకున్న ఇబ్బంది ఏంటి?: కేంద్రాన్ని నిలదీసిన వినోద్
హైకోర్టు విభజనలో కేంద్రానికున్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని ఎంపీ వినోద్ లోక్ సభలో నిలదీశారు. లోక్ సభలో హైకోర్టు విభజనపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. దీంతో వాయిదా అనంతరం స్పీకర్ టీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పార్లమెంటు ఆమోదం పొందిందని, అందులో హైకోర్టును విభజిస్తామని చట్టం చేశారని అన్నారు. అయితే ఏపీకి హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారనేది కేంద్రం నోటిఫై చేస్తే... రాష్ట్రపతి దానిని ఓకే చేస్తారని, హైకోర్టు విభజనను నోటిఫై చేసేందుకు కేంద్రం తాత్సారం చేస్తోందని, దాని వల్ల కేంద్రానికి ఒరిగే లాభం ఏమిటో అర్ధం కావడం లేదని, పార్లమెంటు తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వానికి గౌరవం లేకపోతే ఎలా? అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.