: ఉత్కంఠభరితంగా బాలీవుడ్... అందరి మధ్యా ఒకటే చర్చ
బాలీవుడ్... అదో రంగుల ప్రపంచం, ఆనందాల హరివిల్లు. అయితే, ఇప్పుడు మాత్రం గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను అనుభవిస్తోంది. దీనికి కారణం... ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్. 'హిట్ అండ్ రన్' కేసులో సెషన్స్ కోర్టు రేపు తుది తీర్పును వెలువరించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సల్లూ భాయ్... ప్రజా జీవితంలోకి ప్రశాంతంగా అడుగుపెడతాడా? లేక జైలుకు వెళతాడా? అన్న టెన్షన్ బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముంబై సినీ పరిశ్రమలోని ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా... వారి మధ్య ఇదే చర్చ నడుస్తోంది. తుది తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, కోర్టు సిబ్బంది మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి వెళ్లేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతరులను లోపలకు అనుమతించరు. రేపు ఉదయం 11.15 నిమిషాలకు సల్మాన్ ను కోర్టులో హాజరుపరచాల్సిందిగా అతని తరపు న్యాయవాదికి ఆదేశాలు అందాయి.