: ఆ విధంగా సంస్థ నష్టాలు తగ్గుతాయట!
అదో పేరుమోసిన ప్రభుత్వ రంగ సంస్థ. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. మారుతున్న సాంకేతికత పుణ్యమాని దాని ప్రాభవం అడుగంటింది. ఆ సంస్థే ఎంటీఎన్ఎల్ (మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్). సంస్థలో మొత్తం ఉద్యోగులు 34 వేల మంది. వీరిలో చాలామందికి ఇప్పుడు పని లేదు. అయినా జీతాలిచ్చి పోషిస్తూ, సాలీనా రూ. 3 వేల కోట్ల నిర్వహణా నష్టాల్లో ఉంది. ఇంత బాధలో కూడా ఒక సంతోషకర విషయం సంస్థ భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అదే వచ్చే పదేళ్లలో 27 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనుండడం. సంస్థలో పనిచేస్తున్న 13 వేల మంది ఇప్పటి టెలికం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోయారు. వీరిలో అత్యధికులు పదవీ విరమణ చేసేవారి జాబితాలో ఉండడంతో సంస్థ భవిష్యత్ లో తిరిగి లాభాల బాటన నడుస్తుందని భావిస్తున్నట్టు ఎంటీఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీ.కే. పువార్ అభిప్రాయపడ్డారు. మొత్తం ఆదాయంలో 70 శాతం వరకూ వేతనాలిచ్చేందుకు కేటాయిస్తుండడమే తమ నష్టాలకు కారణమని ఆయన వివరించారు. జనవరి 2015 నాటికి సంస్థ రూ. 16,332 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ తరువాత ఈ నష్టాలు దిగివస్తాయని పువార్ అన్నారు.