: హైదరాబాదును తాకిన ’అగ్రిగోల్డ్‘ నిరసనలు... పంజాగుట్టలో బాధితుల ఆందోళన
అధిక రాబడుల పేరిట జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన నిరసనలు హైదరాబాదునూ తాకాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది బాధితులు నిన్న విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాజాగా నేటి ఉదయం హైదరాబాదు చేరుకున్న బాధితులు పంజాగుట్టలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్ మాటలు నమ్మి, పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన తాము అటు డిపాజిటర్ల నుంచే కాక తమ కుటుంబాల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఏజెంట్లు వాపోతున్నారు. సంస్థ మోసంపై నమోదైన కేసు దర్యాప్తులో వేగం లేదని, తక్షణమే ఆ సంస్థ ఆస్తులు అమ్మైనా తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.