: శ్రీనికి ఇక ఇంటిపోరు... అమ్మాయిని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారంటున్న ‘గే’ కొడుకు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్య బాధ్యతలతో మొదలైన ఇబ్బందులు ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోయిన ఆయన, ఐసీసీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే చట్టపరంగా చర్యలకూ సిద్ధమని బీసీసీఐ బహిరంగంగా ప్రకటించింది. బయటి ఇబ్బందులతో సతమతమవుతున్న శ్రీనికి తాజాగా ఇంటిపోరూ మొదలైంది. సాక్షాత్తు ఆయన కుమారుడు అశ్విన్ ఆయనపై విమర్శలు గుప్పించాడు. త్వరగా పెళ్లి చేసుకోవాలని తనను తన తండ్రి సతాయిస్తున్నారని వాపోయిన అశ్విన్, తనకు వారసుడిని ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శ్రీని కొడుకు అశ్విన్ స్వలింగ సంపర్కుడట. ఇదివరకే ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన అశ్విన్, తాజాగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ తనను తండ్రి వేధిస్తున్నాడని ఆరోపించి మరోమారు వార్తల్లోకెక్కాడు.