: జుమ్మెరాత్ బజార్ లో పోలీసుల సోదాలు...కార్డాన్ అండ్ సెర్చిలో ఆరుగురు రౌడీషీటర్ల అరెస్ట్
హైదరాబాదు నగరంలో చీకటి వ్యాపారానికి అడ్డా జుమ్మెరాత్ బజార్. పాతబస్తీలోని ఈ ప్రాంతం దేశ, విదేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా దిగుమతి అయిన సరుకు విక్రయాలకు పెట్టింది పేరు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని 400 మంది పోలీసులు చుట్టుముట్టారు. కార్డాన్ అండ్ సెర్చి పేరిట ఇంటింటినీ జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో ఆరుగురు రౌడీ షీటర్లు అరెస్టయ్యారు. మరో 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సోదాలకు నేతృత్వం వహించిన వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. సోదాల్లో భాగంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.