: మూడో రోజుకు చేరిన శివాజీ ‘ప్రత్యేక’ దీక్ష... జిల్లాల్లో శివాజీకి మద్దతుగా ఆందోళనలు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. నిన్ననే ఆయన దీక్షకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పాటు జేపీ నెలకొల్పిన లోక్ సత్తా, ఆర్ఎస్పీ తదితర రాజకీయ పార్టీలు, ఇండియన్ దళిత్ క్రిస్టియన్, మాల మహానాడు తదితర ప్రజా సంఘాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా శివాజీకి సంఘీభావం ప్రకటించారు. ఇక వామపక్షాల తరఫున సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కూడా నిన్ననే శివాజీ దీక్షకు మద్దతుగా ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే దాకా తన దీక్షను విరమించేది లేదని కూడా శివాజీ ప్రకటించారు. కొన్ని పార్టీలు, ప్రజా సంఘాల నేతలు మరో అడుగు ముందుకేసి శివాజీ దీక్షకు మద్దతుగా పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే, శివాజీ ఆరోగ్యంపై దృష్టి సారించిన పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. శివాజీ ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.