: సీన్ రివర్స్ ... జైలు సిబ్బందిని ఖైదీలు ఉతికేశారు!
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో జరిగే వింతలు, విడ్డూరాలు ప్రపంచంలో ఎక్కడా చోటుచేసుకోవంటే అతిశయోక్తి కాదు. శిక్ష పడ్డ ఖైదీలను జైలు సిబ్బంది రాచి రంపాన పెడతారని, ఎందుకీ తప్పు చేశామురా బాబు? అనుకునేలా శిక్ష అనుభవించి బయటికి వస్తారని అంతా ఊహించుకుంటారు. కానీ బలియా జిల్లా కేంద్ర కారాగారంలో ఒక ఖైదీ జైలు సిబ్బందిపై చేయిచేసుకున్నాడు. దీంతో, ఖైదీల్లో ఎక్కడలేని ధైర్యం, ఐకమత్యం పొంగుకొచ్చింది. అంతే... దొరికిన సిబ్బందిని దొరికినట్టుగా ఉతికేశారు. ఖైదీల దాడిలో రవీంద్ర రాజ్ బార్ అనే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించిన జైలు సిబ్బంది, విధులు బహిష్కరించి జైలు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ సంఘటన స్థలికి చేరుకుని సిబ్బందితో మాట్లాడి, దర్యాప్తుకు ఆదేశించారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.