: సూపర్ ఐడియా... ఏడాదిన్నరలో అద్భుత విజయం సాధించిన స్టార్టప్


వినోదాన్ని ఎవరు కోరుకోరు... కానీ ఎంత మూల్యానికి? ఓ పది గంటల జర్నీకి ఒక 100 రూపాయలతో చూడలేనన్ని సినిమాలు, ఆడలేనన్ని గేమ్స్ అందిస్తే... ఇద్దరు టెక్కీలకు వచ్చిన ఈ ఆలోచన అద్భుత విజయాన్ని సాధించింది. వారిపై ప్రశంసల వర్షాన్ని కురిపించింది. కోట్ల రూపాయల పెట్టుబడులు అందించింది. అదే ఆనంద్ సిన్హా, జార్జ్ అబ్రహాంల కథ. వీరు డిసెంబర్ 2013లో ప్రారంభించిన స్టార్టప్ సంస్థ 'ప్రెస్ ప్లే' ఇప్పుడు దూసుకుపోతోంది. ఇక అసలు విషయానికి వెళితే, గంటల గంటల ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆనంద్ సిన్హా ఎంతో బోర్ అనుభవించాడు. ఒకరోజు ఢిల్లీ నుంచి అమృతసర్ ప్రయాణించాల్సి వచ్చింది. బస్సెక్కే ముందు వచ్చిన చిన్న ఆలోచన అతని జీవితాన్ని మార్చివేసింది. బస్సులో వినోదం అందించాలన్న ఉద్దేశంతో 10 ట్యాబ్స్ కొనుగోలు చేసి వాటిల్లో సినిమాలు, గేమ్స్ లోడ్ చేసి ప్రయాణికులకు రూ. 100కు అద్దెకివ్వాలని తలచాడు. నిమిషంలో అన్ని ట్యాబ్స్ అద్దెకు వెళ్లిపోయాయి. ఇక మరుసటి రోజు నుంచి అదే అతని వ్యాపారమైంది. డిసెంబర్ 2013 నుంచి ఇప్పటివరకూ నికర అమ్మకాల రూపంలో రూ. 1.26 కోట్ల ఆదాయం రాగా, 2017-18 నాటికి రూ. 100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంస్థ సాగుతోంది. వీరి ఆలోచనకు ముచ్చటపడ్డ ఏంజల్ ఇన్వెస్టర్లు ఆగస్టు 2014లో 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 3 కోట్లు) పెట్టి ప్రోత్సహించారు. ఆపై గత నెలలో సికోయా కిపిటల్ 2.2 మిలియన్ డాలర్లు (సుమారు 12.5 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడీ సంస్థ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సేవలందిస్తోంది. బస్సు బయలుదేరే సమయానికి 'ప్రస్ ప్లే' ప్రతినిధి వచ్చి ట్యాబ్స్ ఆఫర్ చేస్తాడు. ఆపై గమ్య స్థానంలో మరో ప్రతినిధి వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటాడు. ప్రముఖ గేమింగ్ సంస్థలు తమ గేమ్స్ లోడ్ చేసుకోవాలని ఆఫర్లు ఇస్తున్నాయి. ఇలా ట్యాబ్ లు అద్దెకిస్తున్నందుకు బస్ ఆపరేటర్లు మాత్రం ఏమీ అడగడం లేదట. పైగా వారికి 'మా బస్సులో ట్యాబ్స్ అద్దెకు లభించును' అని అదనపు సేవలు అందిస్తున్నట్టు భావిస్తున్నారు. గతంలో ఆనంద్ సిన్హా 'జొమాటో'లో పనిచేశారు. హైదరాబాదులోని హెడ్జ్ ఫండ్ సంస్థ 'దేషా'లోనూ పనిచేశాడు. అప్పటి సహచరులంతా ఇప్పుడతని కింది స్థాయి ఉద్యోగులయ్యారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఇవే సేవలను రైళ్లు, విమానాల్లోనూ అందించాలని నిర్ణయించారు. బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కూడా అందించడం వీరి ఇంకో లక్ష్యం. త్వరలోనే టచ్ ప్లే పేరిట 30 సినిమాలు, 1000 పాటలు తదితరాలతో కూడిన ఓ యాప్ ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అన్ని భాషలకు చెందిన కంటెంట్ ఉండేలా జాగ్రత్తపడి త్వరలోనే యాప్ విడుదల చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు 2 వేలకు పైగా ట్యాబ్ లను అద్దెకిస్తున్నామని, మే నెలాఖరుకు ఈ సంఖ్య 3 వేలు దాటుతుందని భావిస్తున్నామని ఆనంద్ సిన్హా వివరించారు. ఆల్ ది బెస్ట్!

  • Loading...

More Telugu News