: ముస్లింలను సజీవదహనం చెయ్యాలన్న మోదీయే ఇండియాలో మా టార్గెట్: అల్ ఖైదా
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ వీడియో 2వ తేదీన అల్ ఖైదా భారత ఉపఖండ విభాగం (ఏక్యూఐఎస్ - అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్) చీఫ్ మౌలానా అసీమ్ ఉమర్ 'ఫ్రం ఫ్రాన్స్ టు బంగ్లాదేశ్: ది డస్ట్ విల్ నెవర్ సెటిల్ డౌన్' పేరిట విడుదల చేశాడు. భారత ప్రధాని గతంలో ముస్లింలపై యుద్ధం చేయాలని వ్యాఖ్యానించినట్టు ఆయన ఆరోపించాడు. ఈ వీడియోలో ఉమర్ స్వయంగా మాట్లాడుతూ, ఐఎంఎఫ్ విధానాల నుంచి డ్రోన్ దాడులు, కెల్లీ లూగర్ బిల్, చార్లీ హెబ్డో రాతలు తదితరాలను ప్రస్తావించాడు. ముస్లింలను సజీవ దహనం చెయ్యాలని మోదీ బహిరంగంగా వ్యాఖ్యానించినట్టు తెలిపాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో ఇటీవలి రచయితల హత్యలు తమ పనేనని ఉమర్ స్పష్టం చేశాడు. ఇండియాలో పవిత్రయుద్ధం (జీహాద్) జరగాలని, ఇస్లామిక్ పాలన తెచ్చి, షరియా చట్టాలు అమలు చేయడమే తమ లక్ష్యమని అన్నాడు. కాగా, భారత అధికారుల వద్ద అసీమ్ ఉమర్ గురించిన సమాచారం పెద్దగా లేకపోవడం గమనార్హం. ఉత్తర భారతావనికి చెందిన వ్యక్తి అయివుండవచ్చని, 90వ దశకంలో పాకిస్థాన్ కు తరలివెళ్లి ఉండవచ్చని మాత్రం అంచనా వేస్తున్నారు.