: ‘యువర్ మనీ... మై లగ్జరీ’: చంద్రబాబు దుబారాపై 'టైమ్స్ నౌ' కథనం!
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా అవతరించగా, ఏపీ తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయింది. ఏపీ నెత్తిన 1.46 కోట్ల రుణ భారం పడిపోయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ కేంద్రం వద్ద వాదించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, మీరు సాయం చేస్తే గానీ కోలుకోలేమంటూ వేడుకున్నారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనపై కేంద్రం వెనుకంజ వేసిన వైనంపై మిత్రపక్షమైనప్పటికీ బీజేపీపై కస్సుమన్నారు. బహిరంగంగానే నరేంద్ర మోదీ సర్కారుపై నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా ఒక పార్శ్వమేనట. రాష్ట్రం అప్పుల్లో ఉంటే, ఆయన మాత్రం వీవీఐపీ లగ్జరీని అనుభవిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోగానే ఆయన తన కోసం దాదాపు రూ.100 కోట్లను ఖర్చు చేశారట. దీనిపై ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ ‘యువర్ మనీ... మై లగ్జరీ’ పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. పర్యటనలు ప్రత్యేక చార్టర్ విమానాలు, హెలికాప్టర్లు, కాన్వాయ్ లో కొత్త వాహనాలు, విదేశీ పర్యటనల పేరిట ఆయన ఈ వంద కోట్ల రూపాయలను దుబారా చేశారని ఆ ఛానెల్ ఆరోపించింది. ‘‘ఐయామ్ ఏ వీవీఐపీ. యువర్ మనీ ఈజ్ మైన్. వన్ ఇయర్.. 100 క్రోర్. 91 శాతం మంది రైతులు రుణాల్లో కూరుకుపోయారు’’ తదితర సబ్ టైటిల్స్ తో ప్రసారం చేసిన కథనం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది.