: అమెరికాలో 'ఉగ్ర' దాడి... ఇద్దరిని మట్టుబెట్టిన భద్రతాదళాలు!
యూఎస్ లోని టెక్సాస్ లో ఓ కార్టూన్ల పోటీ జరుగుతున్న ప్రాంతంపై ఉగ్రవాదులు దాడి చేశారు. వెంటనే స్పందించిన భద్రతాదళాలు సాయుధులైన ఇద్దరిని మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. టెక్సాస్ పరిధిలోని డల్లాస్ కు 20 కిలోమీటర్ల దూరంలోని గార్లాండ్ లో మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ల పోటీ జరుగుతున్న ప్రదేశం దగ్గర ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కార్టూన్ల పోటీ జరుగుతున్న ప్రాంతానికి దూసుకువచ్చి గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ అధికారిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని గార్లాండ్ మేయర్ డగ్లస్ అథాస్ తెలిపారు. భద్రతా దళాలు వీరిలో ఒకరిని వెంటనే కాల్చివేశారని, మరో వ్యక్తిని అరెస్ట్ చేద్దామని యత్నించగా, అతను తన వీపుపై ఉన్న బ్యాగులో వెతకడాన్ని చూసి పేలుడు పదార్థాలు ఉన్నాయన్న అనుమానంతో చంపేయాల్సి వచ్చిందని వివరించారు. వీరిద్దరికీ ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు.