: కాశ్మీర్లో పరీక్ష రాస్తున్న ఆవు... ఎలా రాస్తుందో చూడాలని ఉందన్న ఒమర్ అబ్దుల్లా
అవును... మీరు చదివింది నిజమే. కాశ్మీర్లో ఓ ఆవు ‘బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్' రాస్తోంది. ఈ ఆవు పేరు కచిర్ గావ్ (గోధుమ రంగు ఆవు), తండ్రి పేరు గూరా దండ్ (ఎర్ర ఎద్దు). వయస్సు 18 సంవత్సరాలు. మే 10న ఉదయం 10 గంటలకు పరీక్షకు హాజరు కావాలని, 9:55 దాటితే ప్రవేశం లేదని చెబుతూ, అధికారులు హాల్ టికెట్ జారీ చేశారు. సంతకం, వేలిముద్రలు ఉండాల్సిన బాక్సుల్లో ఆవు తోక, గిట్టలు ఉన్నాయి. ఇంకేం, పీడీపీ, బీజేపీ పాలనలో మంచి విద్యా ప్రగతి కనిపిస్తోందని, ఆవులు కూడా హాల్ టికెట్లు పొంది పరీక్షలు రాస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ నేత జునైద్ అజీమ్ వ్యాఖ్యానిస్తూ, ఈ హాల్ టికెట్ ను ట్విట్టర్లో పెట్టారు. "ఆవు పరీక్ష బాగా రాస్తుందో లేదో చూడాలని ఉంది" అని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మనిషి బొమ్మకు, జంతువుల బొమ్మకు తేడాను సాఫ్ట్‌వేర్ గుర్తించలేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని బోర్డు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ వివరణ ఇచ్చారు.