: నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తుల జప్తు
'దశావతారం', 'ఐ' వంటి పలు చిత్రాలు నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఆస్తులను చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు జప్తు చేసింది. సుమారు రూ. 97 కోట్ల బకాయిలను ఆయన తీర్చకపోవడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పలు చిత్రాల నిర్మాణం నిమిత్తం ఆయన తన ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ మొత్తం వడ్డీతో కలిపి రూ. 97 కోట్లకు చేరుకోగా, రుణాన్ని చెల్లించడంలో రవిచంద్రన్ విఫలమయ్యారు. దీంతో ఆస్తులను జప్తు చేసేందుకు బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. ఆయన సొంత భవనాలు, ఇళ్లు, థియేటర్లు సహా ఆస్తులను జప్తు చేస్తున్నట్టు వివరించింది. కాగా, దీనిపై ఆస్కార్ ఫిలింస్ స్పందిస్తూ, రుణం చెల్లించేందుకు గడువు కోరామని, బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.