: ఏపీ పోలీస్ అంటే ఇంతేనా?
ఆంధ్రా పోలీస్ అంటే మావోల పీచమణచడంలో సిద్ధహస్తులని, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో ఉంటారని, ఆచూకీ కనిపెట్టి న్యాయం చేయడంలో చురుకుగా ఉంటారని దేశవ్యాప్తంగా పేరుంది. అయితే రాష్ట్ర విభజన తరువాత ఏపీ పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో నైట్ డామినేషన్ పేరిట సగం పరువు పోగా, శేషా చలం ఎన్ కౌంటర్ కారణంగా ప్రతిష్ఠ మసకబారింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏకంగా వారి పరువుపోయే సంఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో రాత్రి సెకెండ్ షో చూసి ఇంటికెళ్తున్న అహ్మద్ అనే వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు పిలిచారు. చెవుడుతో బాధపడుతున్న అహ్మద్ వారి మాట వినిపించుకోకుండా వెళ్లిపోతుండడంతో ఆగ్రహం చెందిన పోలీసులు, అతడ్ని పట్టుకుని చితకబాదారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అహ్మద్ తల్లి, ప్రాధేయపడినా పట్టించుకోకుండా పోలీసులు చితక్కొట్టి వదిలారు. తర్వాత అతడిని కావలి ప్రభుత్వాసుపత్రిలో చేర్చి అతని తల్లి చికిత్స చేయించుకుంటోంది. దీంతో అహ్మద్ పై పోలీసులు కండకావరం ప్రదర్శించారని స్థానికులు మండిపడుతున్నారు.