: ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డ చిరంజీవి
ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విరుచుకుపడ్డారు. మోదీ చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనని అన్నారు. హుదూద్ తుపాను సమయంలో అంత చేస్తాం, ఇంత చేస్తాం అని చెప్పిన మోదీ ఏం చేశారని ఆయన నిలదీశారు. తన నోటితోనే వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి, కేవలం 600 కోట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాజధానిపై మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరని ఆయన మండిపడ్డారు. విదేశీ పర్యటనలంటే జోరు చూపే ప్రధానికి దేశ సమస్యలపై అవగాహన లేదని చిరంజీవి పేర్కొన్నారు. మోదీ మాటలు చెబుతూ ప్రచారం చేసుకునేందుకు ఆరాటం చూపుతారని, అంతకు మించి ఆయన దేశానికి చేసిందేమిటో చెప్పాలని బీజేపీ నేతలకు ఆయన సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లులంటూ పార్లమెంటులో నచ్చిన సవరణలు చేసిన బిల్లులను ప్రవేశపెడుతున్నారని ఆయన విమర్శించారు. భూసేకరణ బిల్లు పేరిట పేద రైతులను దగా చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు అంటారు...చేతల కొచ్చేసరికి వంద కోట్లు విడుదల చేస్తారు...ఇది చాలదా, మోదీ మాటల ప్రధాని అని చెప్పడానికి? అంటూ చిరంజీవి పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు.