: లొంగిపోతానన్న దావూద్ ఇబ్రహీం... కుదరదన్న సీబీఐ!
చీకటి సామ్రాజ్యాధినేత, అండర్ వరల్డ్ డాన్ గా పేరుగాంచిన దావూద్ ఇబ్రహీం లొంగిపోతానంటే, ఎవరు కాదంటారు?. ఎవరూ కాదనరు, కాని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మాత్రం కుదరనే కుదరదు అనేసింది. ఆశ్చర్యంగా ఉన్నా, నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే, గతంలో సీబీఐలో డీఐజీగా పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి చెబుతున్న మాటలివి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సూపర్ కాప్ నీరజ్ కుమార్, ముంబై బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో సీబీఐలో డీఐజీగా పనిచేశారు. 1993, మార్చి 12న ముంబై బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే ముంబై వీడి పాకిస్థాన్ కు పారిపోయిన దావూద్ ఇబ్రహీం లొంగిపోయేందుకు చాలా మార్గాల్లో యత్నించాడట. నేరుగా నీరజ్ కుమార్ కే అతడు మూడుసార్లు ఫోన్ చేశాడు. అయితే సీబీఐ బాసులు అందుకు ససేమిరా అన్నారు. లొంగిపోకుండా భారత్ వస్తే, ప్రత్యర్ధులు తనను హతమారుస్తారని భయపడ్డ దావూద్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీతోనూ లొంగుబాటుకు రాయబారం నెరపాడు. 2013లో ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయిన నీరజ్ కుమార్, తన అనుభవాలను క్రోడీకరిస్తూ ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఆసక్తికర అంశాలున్నాయి.