: విశాఖలో జ్యూరిచ్ వాటర్ పార్క్... సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న స్విస్ సంస్థ


సముద్ర అలల తాకిడి, వేగంగా వీచే సముద్ర గాలులను ఆస్వాదించేందుకు ఇకపై విశాఖ బీచ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. నగరం నడిబొడ్డునే సముద్ర అలల తాకిడి అనుభూతిని ఆస్వాదించవచ్చు. అదెలా అంటారా, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ఏర్పాటైన జ్యూరిచ్ వాటర్ పార్క్ లో ఈ తరహా అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పార్కు, త్వరలో ఏపీలోని విశాఖపట్నంలోనూ ఏర్పాటు కానుంది. ఇటీవల స్విట్జర్లాండ్ లో పర్యటించిన సందర్భంగా అక్కడి తెలుగు ప్రజల కోరిక మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జ్యూరిచ్ వాటర్ పార్కును సందర్శించారు. అంతేకాక అదే తరహా వాటర్ పార్కును తమ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలని ఆ పార్క్ నిర్వాహకులను కోరారు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు వాటర్ పార్క్ నిర్వాహకులు ఇప్పటికే ఏపీలో పలుమార్లు పర్యటించి, వివిధ ప్రదేశాలను పరిశీలించారు. చివరకు పార్క్ ఏర్పాటు కోసం విశాఖను ఎంపిక చేశారు. ఇక వాటర్ పార్కును పూర్తిగా సొంత నిధులతోనే ఏర్పాటు చేసేందుకు వారు సిద్ధమయ్యారు. పార్క్ లో సహజసిద్ధమైన అనుభూతిని సందర్శకులకు అందించడంతో పాటు పలు వాటర్ స్పోర్ట్స్ నూ అందుబాటులోకి తెచ్చేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాక రాష్ట్రంలో మరో టూరిజం ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేసేందుకు వారు చంద్రబాబు సర్కారు ముందు ప్రతిపాదనలు పెట్టారట.

  • Loading...

More Telugu News