: అమ్మానాన్న లేరు ... తాతయ్య పొమ్మన్నాడు... చిన్నారుల జీవనపోరాటం!
ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులు మరణిస్తే అది పెద్ద నష్టం...బంధువులు వారిని ఆదరించడానికి నిరాకరిస్తే అది పెద్ద కష్టం... అంత పెద్ద నష్టాన్ని, కష్టాన్ని కూడా భరించి నలుగురు చిన్నారులు జీవనపోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాకు సమీపంలోని ఓ గ్రామంలో రెండేళ్ల క్రితం పేదరికాన్ని భరించలేని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి నలుగురు పిల్లలు. వీరి జీవితాలని చిదిమేయకూడదనుకున్నారో, లేక చావులో కూడా వీరి భారం మోయకూడదనుకున్నారో కానీ, నలుగురు పిల్లలను గాలికొదిలేసి వారి దారి వారు చూసుకున్నారు. దీంతో వారిని తాతయ్య ఆదరించాడు. అయితే ఇటీవలే వారిని ఆయన బయటికి గెంటేశాడు. అంతే, ఆ నలుగురూ ఒక్కసారిగా అనాథలుగా మిగిలిపోయారు. దీంతో వీరిలో ఒకడైన రోహిత్ (6) స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. వారు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించాలని పంచాయతీని ఆదేశించారు. ఆ నలుగురిలో పెద్దమ్మాయి సోనియా (12) కూలికి వెళ్తూ మిగిలిన ముగ్గురినీ సాకుతోంది. తనకు కూడా స్కూలుకు వెళ్లాలని ఉందని చెబుతోంది. కానీ ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు స్కూలుకు వెళ్లడం సంతోషంగా ఉందని చెబుతోంది. తన తండ్రికి వాటాగా వచ్చిన తాతయ్య ఇంటి పక్కనే ఇటుకలతో ఓ ఇంటిని నిర్మించుకుని నలుగురూ ఉంటున్నారు. వారిని ఎందుకు బయటకు పంపేశారని అడుగగా, తనకే ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారిని పెంచడమే కష్టంగా ఉందని, ఈ నలుగురినీ కలుపుకుంటే పెనుభారంగా మారుతోందని, అందుకే వారిని పంపేశానని చెప్పారు.