: క్రిమినల్ గా మారిన ఐఏఎస్!
అతడో బాధ్యత మరచి జైలుపాలైన ఐఏఎస్ ఆఫీసర్. గతంలో హర్యానాలో జరిగిన టీచర్ల నియామకాల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడి తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. అయినా బుద్ధి రాలేదు. తన స్నేహితుడిని హత్య చేసేందుకు జైల్లో పరిచయమైన గ్యాంగ్ స్టర్ తో కలిసి పథకం పన్నాడు. గుట్టు రట్టు కావడంతో మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. న్యూఢిల్లీలోని ఒక విలువైన స్థలానికి చెందిన లావాదేవీల్లో స్నేహితునితో ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అడడిని చంపాలని గ్యాంగ్స్టర్ షౌకత్ పాషాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలీసులు మరో కేసులో షౌకత్ గ్యాంగ్లోని ఓ ఇన్ఫార్మర్ ను అరెస్ట్ చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విచారించగా నిజమని తేలింది. కేసుకు సంబంధించి మరో ఇద్దరు షార్ప్ షూటర్లను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్ అధికారి ఒకరు వివరించారు. పోలీసులు కనుగొన్న మరో ట్విస్ట్ ఏమంటే, నేరాన్ని హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుటుంబంపైకి నెట్టి తద్వారా నియామకాల కుంభకోణం కేసులో బెయిల్ పొందొచ్చని సంజీవ్ కుమార్ భావించాడని పోలీసులు చెప్పారు.