: బెంగాల్ నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి పవన్ కల్యాణ్ ను కలిసిన వీరాభిమాని
టాలీవుడ్ లో ఎందరు హీరోలున్నా పవన్ కల్యాణ్ చాలా విలక్షణమైన వ్యక్తి. నటనలో తనకంటూ ఓ శైలిని సృష్టించుకున్న ఈ పవర్ స్టార్, వ్యక్తిత్వంలోనూ పదుగురికీ భిన్నంగా కనిపిస్తారు. అందుకే అభిమానులకు ఆయనంటే అంత ఇష్టం. తన పనేదో తాను చేసుకుపోయే మనస్తత్వం ఉన్న పవన్ అంటే అభిమానులు ఎంతో ఆపేక్ష కనబరుస్తారన్నదానికి ఇదే నిదర్శనం. అద్దంకి రవి అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ అంటే ప్రాణం. రవి పశ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ లో నివాసముంటున్నారు. ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ ను కలవాలనుకుంటున్న ఆయన ఈ నెల 3న ఖరగ్ పూర్ నుంచి సైకిల్ పై హైదరాబాద్ బయల్దేరారు. ఈ రోజు సాయంత్రం ఐదింటికి హైదరాబాదులోని పవన్ కార్యాలయానికి చేరుకుని తన అభిమాన హీరోను కలుసుకున్నారు. తనకోసం ఇంత కష్టపడి వచ్చిన అభిమానిని పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు ఘనమైన ఆతిథ్యమిచ్చారు. పవన్ చాలాసేపు రవితో ముచ్చటించారు. ఇక, రవి మాట్లాడుతూ... చాలా రోజుల నుంచి పవన్ ను చూడాలన్న కోరిక ఇప్పటికి తీరినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.