: సినీ నటులతో క్రికెట్ మ్యాచ్ పెట్టి నిధులు సమకూరుస్తాం: కేసీఆర్ కు హామీ
టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులతో జూన్ 21న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించి తద్వారా వచ్చిన నిధులు తెలంగాణ పథకాల కోసం అందజేస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ ఇచ్చారు. హైదరాబాదులో సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల కోసం క్రికెట్ మ్యాచ్ నిర్వహించి నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తామని వారు వెల్లడించారు. కాగా, తెలుగు సినీ పరిశ్రమలోని పేద కళాకారులను ఆదుకునేందుకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు మాత్రమే సినీ నటులు క్రికెట్ మ్యాచ్ ద్వారా నిధులు సేకరించి ప్రభుత్వానికి తమవంతు విరాళంగా ఇచ్చేవారు. తాజాగా ప్రభుత్వ పథకాల కోసం మ్యాచ్ నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు రావడం విశేషం.