: నేపాల్ భూకంపంలో బీసీసీఐ మాజీ కన్సల్టెంట్ దుర్మరణం
నేపాల్ భూకంపం సామాన్యులతో బాటు అనేకమంది ప్రముఖులను కూడా బలిదీసుకుంది. బీసీసీఐకి గతంలో ఫిజియోథెరపీ కన్సల్టెంట్ గా వ్యవహరించిన డాక్టర్ విపుల్ చావ్దా (39) నేపాల్ లో సంభవించిన భూకంపంలో దుర్మరణం పాలయ్యారు. లాంగ్తాంగ్ వ్యాలీలో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఆయన ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు. చావ్దా 2001 నుంచి 2006 వరకు ముంబయి రంజీ జట్టుకు ఫిజియోగా వ్యవహరించారు. సాహసాలంటే ఇష్టపడే ఆయన ఏప్రిల్ 19న ఖాట్మండూ వెళ్లారు. అంతకుముందు ఆయన ఎవరెస్టు బేస్ క్యాంప్ ను అధిరోహించారు. కాగా, విపుల్ చావ్దా మృతిపై ఆయన సోదరుడు డాక్టర్ కేతన్ చావ్దా మాట్లాడుతూ... ట్రెక్కింగ్ మధ్యలో ఉండగా, భూకంపం సంభవించిందని, విపుల్ అక్కడిక్కడే చనిపోయినట్టు అతని సహచరులు చెప్పారని వివరించారు. పర్వతం పైనుంచి పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ కిందికి వచ్చాయని, వాటిలో ఒకటి విపుల్ మరణానికి కారణమని తెలిసిందని కేతన్ తెలిపారు.