: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా... నిబంధనలు పాటించనందుకు జరిమానా
'నో యువర్ కస్టమర్' (కేవైసీ) నిబంధనలను సక్రమంగా పాటించని మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లు ఒక్కోటి రూ. 1.5 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు కేవైసీ అమలులో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయన్న ఆరోపణలున్న 8 బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, విజయా బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ లను ఇకపై ఇలా జరగరాదని హెచ్చరించింది. ఓ సంస్థ చేసిన ఫిర్యాదుపై స్పందించి, కొన్ని బ్యాంకులు నిర్వహిస్తున్న ముంబై శాఖల్లో జూలై 2014 నుంచి డిపాజిట్ అయిన ఫిక్సెడ్ ఖాతాలను పరిశీలిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. కాగా, గత సంవత్సరం కేవైసీ నిబంధనలు పాటించని ఐసిఐసిఐ, యాక్సిస్, కెనరా తదితర 12 బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.