: ఎస్సైని రాళ్లతో కొట్టిన బ్లేడ్ బ్యాచ్
రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. విజయవాడ కేంద్రంగా విలసిల్లిన బ్లేడ్ బ్యాచులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కాకినాడ, రాజమండ్రిల్లో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాజమండ్రిలో పోలీసులపైనే దాడికి దిగిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజమండ్రిలోని దానవాయి పేటలోని వీటీ కళాశాల పరిసరాల్లో జేబుదొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్యాటరింగ్ కార్మికులు హత్య చేశారు. దీంతో బ్లేడ్ బ్యాచ్ రంగంలోకి దిగి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. 30 మంది సభ్యులు కలిగిన బ్లేడ్ బ్యాచ్ ఆటోలో తిరుగుతూ క్యాటరింగ్ కార్మికులపై దాడులకు పాల్పడుతోంది. దీనిపై పక్కా సమాచారమందుకున్న పోలీసులు బ్లేడ్ బ్యాచ్ ను ఆదుపులోకి తీసుకునేందుకు వీటీ కాలేజ్ కు వెళ్లారు. వీరి రాకను గమనించిన బ్లేడ్ బ్యాచ్ పోలీసులపై రాళ్ల దాడి ప్రారంభించింది. ఈ దాడిలో రాజమండ్రి త్రీటౌన్ ఎస్సై సంపత్ కు గాయాలయ్యాయి. ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.