: నా ట్వీటు చూశాకే నేపాల్ ప్రధానికి భూకంపం గురించి తెలిసింది: మోదీ
నేపాల్ ను వణికించిన భూకంపం గురించి ప్రపంచానికి సమాచారం తెలిసిన గంటల తరువాత మాత్రమే ఆ దేశ ప్రధాని ప్రధాని సుశీల్ కోయిరాలాకు విషయం తెలిసింది. ఉదయం 11:40 గంటల సమయంలో తొలి ప్రకంపనలు రాగా, ఆపై 10 నిమిషాల వ్యవధిలోనే మీడియా సంస్థలు ఫ్లాష్ న్యూస్ వేశాయి. ఆ సమయంలో కోయిరాలా థాయ్ లాండ్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు. సుమారు గంట తరువాత ప్రమాదంపై మోదీ ట్వీట్ చేసిన తరువాతనే ఆయనకు విషయం తెలిసింది. ఇదే విషయాన్ని కోయిరాలా తనతో చెప్పినట్టు మోదీ వివరించారు. పార్లమెంట్ పనితీరుపై జర్నలిస్టులకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇదే సమయంలో, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆసక్తికర సంఘటననూ వెల్లడించారు. ఓ వ్యక్తితో కలిసి చానాళ్ల క్రితం తాను భోజనం చేశానని, అప్పుడా వ్యక్తికి తన ఫోన్ నెంబరు ఇచ్చానని చెబుతూ, ఒకనాటి అర్ధరాత్రి 3:15 గంటల సమయంలో తనకు ఫోన్ చేసి ఒక పెద్ద శబ్ధం వినిపించాడని, అది రైలు ప్రమాదానికి చెందినదని చెప్పాడని వివరించారు. తాను వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫోన్ చేసి, వారికి తెలియని ప్రమాదం గురించి చెప్పి అలర్ట్ చేసి 20 నిమిషాల్లో రిలీఫ్ టీంను పంపి సహాయక చర్యలకు దిగామని తెలిపారు. ఉదయం తాను అక్కడికి వెళ్లేసరికి గాయపడిన వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అప్పటి దాకా మీడియాకు సైతం విషయం తెలియదని, మిత్రులకు సరైన వార్తలు, వీడియోలు దొరకలేదని నవ్వుతూ అన్నారు. అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సైతం మధ్యాహ్నం తరువాతే ఘటనా స్థలికి రాగలిగారని గుర్తు చేసుకున్నారు. మీడియా వారు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.