: తప్పతాగి పెళ్లిపీటలెక్కిన వరుడిని ఛీ పొమ్మన్న వధువు


మరికాసేపట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కోటి ఆశలతో కొత్త జీవితం గురించిన ఊహల్లో విహరిస్తున్న కుమారి (పేరు మార్చాం) ఒక్కసారిగా అవాక్కయింది. కారణం, పెళ్లికొడుకు తప్పతాగి వచ్చి ఊగిపోతూ, కంట్రోల్ లో లేకపోవడమే. దీంతో కలత చెందిన వధువు తనకీ పెళ్లి వద్దని కల్యాణ మండపాన్ని విడిచి ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో ఉన్న అజ్నార్ గ్రామంలో జరిగింది. వరుడి తరపు బంధువులు తమ పరువు పోతోందంటూ, పోలీసులను ఆశ్రయించినప్పటికీ, వారు కూడా వధువుకు బాసటగా నిలిచారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, వరుడు అరవింద్ వివాహం కుమారి (20)తో జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. సంప్రదాయ ఎరుపు రంగు వివాహ దుస్తుల్లో మెరిసిపోతున్న కుమారి 'జైమాల్' (వివాహానికి ముందు జరిగే దండలు మార్చుకునే తంతు) వేడుకకు సిద్ధమైంది. బంధువులు, స్నేహితులు పక్కనుండగా, డీజే సౌండుకు ఒళ్లు మరచి స్టెప్పులేస్తూ, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో వరుడు వచ్చాడు. దీంతో ఖిన్నురాలైన కుమారి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత వరుడి తరపు వారు పెద్ద రగడనే సృష్టించారు. అయితే, గ్రామ పెద్దలు మాత్రం ఆ అమ్మాయిని వివాహానికి ఒత్తిడి చేయరాదనే నిర్ణయించడంతో వారి పప్పులు ఉడకలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. మందు కొట్టి వెళ్లిన వ్యక్తిని చేసుకోనని అమ్మాయి అంటుంటే తాము ఏమీ చేయలేమని చెప్పిన వారు, తప్పంతా వరుడిదేనని తేల్చారు.

  • Loading...

More Telugu News