: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పశ్చాత్తాపం... ఏపీ ప్రజలకు సారీ చెప్పిన యూత్ కాంగ్రెస్ చీఫ్!
తెలంగాణవాదుల డిమాండును మన్నించి ఏపీని ముక్కలు చేసి ఘోర తప్పిదమే చేశామని కాంగ్రెస్ పార్టీ పశ్చాత్తాపపడుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసినందుకు గుండె లోతుల్లోంచి క్షమాపణ చెబుతున్నామని ఏపీ ప్రజలకు ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ యువజన విభాగం యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సూరజ్ హెగ్డే నిన్న విజయవాడలో కీలక వ్యాఖ్య చేశారు. రాష్ట్రాన్ని విభజించినందుకు తమను క్షమించాలని, గుండె లోతుల్లోంచి క్షమాపణలు చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కర్ణాటకతో పాటు ఏపీ తమకు అండగా నిలబడ్డాయని చెప్పిన ఆయన, 2019 నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవడమే కాక రాష్ట్రంలో పాలనా పగ్గాలను దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు. అదే సమయంలో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ఏపీ తన వంతు బాధ్యతను నెరవేర్చాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.