: ఆయుధాల గోడౌన్లో పేలుడు... 25 మంది నరహంతకుల మృతి
ప్రపంచాన్ని తమ ఉన్మాద చర్యలతో గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సిరియా రాజధాని డెమాస్కస్ లో ఐఎస్ఐఎస్ నిర్వహణలోని ఆయుధాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని సిరియాలోని మానవహక్కుల పరిశీలకులు తమ నివేదికలో వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని సమాచారం. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. డెమాస్కస్ పశ్చిమ భాగంలో ఉన్న డెయిర్ అల్ జోర్ ప్రావిన్స్ లో బాంబు పేలుళ్లు సర్వసాధారణమని నివేదిక వెల్లడించింది.