: 400 భాగాలుగా హైదరాబాదు విభజన
హైదరాబాదును పరిశుభ్రనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. దానికోసం వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో బాగంగా మే 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాదును చేపట్టనున్నారు. మే 16న గవర్నర్ నరసింహన్ తో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. హైదరాబాదు నగరాన్ని 400 భాగాలుగా విభజించి, సినీ నటులు, క్రీడాకారులు, నేతలు, స్థానికుల సాయంతో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలను చైతన్యపరిచేందుకు సాంస్కృతిక కళాబృందాలతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాటలు, కళారూపాలు తయారు చేయాలని సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ హైదరాబాదుపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.