: గతి తప్పిన రష్యా అంతరిక్ష నౌక... ఎక్కడైనా కూలవచ్చన్న సైంటిస్టులు
అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఆహారం తదితరాలను తీసుకువెళుతున్న మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్ గతి తప్పింది. సూయజ్ రాకెట్ ద్వారా ప్రోగ్రస్ ఎం27ఎం స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపగా, గమ్యాన్ని చేరకుండానే కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. మంగళవారం నాడు రాకెట్ ప్రయోగం జరుగగా, అప్పటి నుంచీ స్పేస్ క్రాఫ్ట్ తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు శాస్త్రజ్ఞులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ తిరుగుతోందని, ఎక్కడైనా, ఎప్పుడైనా కూలిపోవచ్చని రష్యన్ స్పేస్ ఏజన్సీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వాస్తవానికి ఈ అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) వ్యోమగాములకు ఆహారం తీసుకుని గత నెల 30నే వెళ్లాల్సి వుంది. ఇక తదుపరి షిప్ జూన్ 19న గాని బయలుదేరదు. దీంతో ఐఎస్ఎస్ వ్యోమగాములు సైతం అక్కడి ఆహార నిల్వలపై ఆందోళన పడుతున్నారు.