: నిన్నటిదాకా జాతి నిధి... నేడు చెత్త!
వందల సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్న జాతి సంపద అది. బహిరంగ వేలం వేస్తే వందలు, వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ, నేడు అది ఎందుకూ పనికిరాని చెత్తతో సమానమైంది. భూకంపం ధాటికి నేపాల్ లోని పురాతన రాచ మందిరాలు, ఆలయాలు కుప్పకూలగా, వాటిల్లోని విలువైన కలప దహన సంస్కారాలకు ఉపయోగపడుతోంది. ముఖ్యంగా దర్బార్ స్క్వేర్ లో కూలిపోయిన పలు కట్టడాల్లో 17వ శతాబ్దం నాటి పలు నిర్మాణాలు ఉన్నాయి. వీటికి ఉపయోగించిన కలపను ఆనాటి శిల్పులు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. కళాఖండాలను వేలం వేసేవారికి అవి దొరికితే ఒక్క దానితోనే లక్షాధికారులు అయిపోయేంత విలువైనవి. కానీ, ఇప్పుడు వర్షానికి తడిసి కొంత నాశనమవుతుండగా, మరికొంత వంట చెరకు కోసం ప్రజలు తీసుకువెళుతున్నారు. కొందరు ప్రజలు అక్కడి ఇటుకలను, దేవాలయాల్లోని విలువైన వస్తువులను గుర్తుగా ఉంచుకునేందుకు పట్టుకెళ్తున్నారు కూడా. ప్రస్తుతం చాలా గుళ్ల వద్ద కాపలా లేదు. అత్యంత విలువైన వారసత్వ సంపద భావి తరాలకు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని పురాతత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు.