: తప్పు చేస్తున్న కొడుకును నడిరోడ్డుపై కొట్టి 'మామ్ ఆఫ్ ది ఇయర్' అనిపించుకున్న మహిళ
వయసు కొచ్చిన కొడుకు కళ్లెదుటే తప్పు చేస్తుంటే తట్టుకోలేక పోయిందా తల్లి. నడిరోడ్డుపైనే బాదేసింది. అక్కడి నుంచీ దూరంగా లాక్కెళ్లింది. ఈ దృశ్యాలను ఓ టెలివిజన్ చానల్ వీడియో తీసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎంతో పాప్యులర్ కాగా, ఉన్నతాధికారులు 'మామ్ ఆఫ్ ది ఇయర్' అంటూ కితాబునిస్తున్నారు. అసలు జరిగింది ఏమంటే, అమెరికాలోని బాల్టీమోర్ లో నల్లజాతి యువకుడు ఫ్రెడ్డీ గ్రేను తెల్ల పోలీసులు కావాలనే చంపారని నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వందలాది సంఖ్యలో వీధుల్లోకి చేరిన నల్లజాతీయుల్లో చాలామంది ముఖానికి ముసుగులేసుకుని పోలీసులపై రాళ్లు రువ్వుతుండగా, ఓ యువకుడిని తేరిపారా చూసిన టోయా గ్రాహమ్ అనే మహిళ, వాడు తన కొడుకు మైఖేల్ అని పోల్చుకుంది. ఆ వెంటనే వాడిని పక్కకు లాక్కొచ్చింది. రెండు పీకింది. ముసుగు తీయరా అని కేకలు వేసింది. అక్కడి నుంచి కొడుకును తీసుకువెళ్లింది. ఈ దృశ్యాలను 'డబ్ల్యుఎంఏఆర్' అనే టీవీ చానల్ చిత్రీకరించింది. వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె చేసిన పనికి అన్ని వైపులా ప్రశంసలు లభించగా, పోలీస్ కమిషనర్ ఆంటోనీ బాట్స్ ఆమెను 'మామ్ ఆఫ్ ది ఇయర్'గా అభివర్ణించారు. నా కొడుకు మరో ఫ్రెడ్డీ గ్రే కాకూడదనే ఇలా చేశానని గ్రాహమ్ అంటోంది. హ్యాట్సాఫ్ గ్రాహమ్!