: 50 గంటలు చావుతో పోరాడిన మృత్యుంజయురాలు


నేపాల్ పై భూమాత ప్రకోపించిన వేళ ఒక్కసారిగా భవంతులు కుప్పకూలితే వేలాది మంది మట్టి కుప్పల కింద చిక్కుకుని సమాధి కాగా, ఈ మహిళ మాత్రం చావుతో పోరాడి మృత్యుంజయురాలిగా మిగిలింది. మహరాజ్ గంజ్ ప్రాంతంలోని ఐదంతస్తుల 'వసుంధరా' భవనం కూడా భూకంపం ధాటికి కుప్పకూలింది. ఆ భవన శిథిలాల కింద సునీతా సితౌలా అనే మహిళ ప్రాణాలతో మిగిలిపోయింది. చుట్టూ చీకటి, పలికేవారు లేరు, పక్కన మృతదేహాలు. అంత భీతిగొలిపే వాతావరణంలో తననెవరైనా కాపాడకపోతారా అన్న చిన్న ఆశతో 50 గంటల పాటు వేచి చూసింది. కాపాడాలని అప్పుడప్పుడూ అరిచింది. భారత్ నుంచి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈమెను గమనించాయి. అత్యవసర మందులు, ఆహారం అందించాయి. గంటల పాటు కష్టపడి బయటకు తీసుకువచ్చాయి. ఈమె భర్త, ఇద్దరు పిల్లలు భూకంపం నుంచి తప్పించుకుని ఓ పాఠశాలలో తలదాచుకొని ఉండడం గమనార్హం. ఖాట్మాండు లోయలో టన్నుల కొద్దీ స్లాబులు, ఇటుకల కింద వందలాది మంది ప్రాణాలతో ఉండి ఉండవచ్చని, వీరిలో సాధ్యమైనంత ఎక్కువ మందిని కాపాడేందుకు కృషి చేస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కులిష్ ఆనంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News