: పరేడ్ గ్రౌండ్ లో మరో భారీ బహిరంగ సభ... జూన్ లో నిర్వహణకు టీడీపీ సన్నాహాలు
హైదరాబాదు జంట నగరాల్లో అత్యంత పెద్దదైన సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్ మరోమారు కేకలు, కేరింతలతో హోరెత్తనుంది. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు పది లక్షల మంది జనం హాజరయ్యారని టీఆర్ఎస్ చెబుతుంటే, కేవలం రెండు లక్షల మందే హాజరయ్యారంటూ టీడీపీ వాదిస్తోంది. హాజరు సంఖ్యను పక్కనబెడితే, బహిరంగ సభతో పరేడ్ గ్రౌండ్ మారుమోగిపోయింది. ఇక జూన్ లో మరోమారు ఈ గ్రౌండ్ రాజకీయ పార్టీ నినాదాలతో దద్దరిల్లనుంది. టీఆర్ఎస్ సభకు దీటుగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టీ టీడీపీ నేతలు నిన్న పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ మేరకు ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పక్కాగా ప్రణాళికలు రచించి, టీఆర్ఎస్ సభను మరిపించేలా బహిరంగ సభను నిర్వహించాలని చంద్రబాబు టీ టీడీపీ నేతలకు సూచించారట.