: కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతున్న సైన్యం
ఒక్కో గంటా గడిచేకొద్దీ నేపాల్ భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. భూమాత తన ఆగ్రహం చూపించి ఇప్పటికే మూడు రోజులు కాగా, మృతుల సంఖ్య 4,300 దాటింది. గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 8 వేలకు చేరింది. శిథిలాల కింద ఎవరైనా బతికున్నారా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం అటు నేపాల్, ఇటు భారత సైన్యాలు కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్నాయి. ఎవరైనా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న పక్షంలో వారి ప్రాణాలు మరో ఒకటి రెండు రోజుల కన్నా నిలిచే పరిస్థితి లేకపోవడంతో సహాయక బృందాలు ఉరుకులు పెడుతున్నాయి. నిన్నటివరకూ సహాయక చర్యలు ఖాట్మాండు, ఇతర పెద్ద పట్టణాలకు పరిమితం కాగా, నేడు గ్రామీణ ప్రాంతాలకు సైన్యం చేరుకున్నట్టు తెలుస్తోంది. కాగా, సోమవారం సాయంత్రం మరో భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1 అని, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా వచ్చిందని మెట్ అధికారులు వివరించారు.