: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ‘తెలుగు’ హైకోర్టు నోటీసులు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్డు నోటీసులు జారీ చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన భూసేకరణకు సంబంధించి ముఖేశ్ అంబానీ, ఆయన సంస్థతో పాటు ఓ స్థానికుడు తనను మోసం చేశారని చెక్కా దుర్గాంబ అనే మహిళ ఫిర్యాదుతో హైకోర్టు ఈ నోటీసులను జారీ చేసింది. కాకినాడకు చెందిన నారాయణరావు అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తన స్థలాన్ని రిలయన్స్ కు విక్రయించాడని, పత్రాలను సరిచూసుకోకుండా రిలయన్స్ కూడా తన స్థలాన్ని స్వాధీనం చేసుకుందని దుర్గాంబ తన పిటిషన్ లో పేర్కొంది. ఇందులో రిలయన్స్ కాని, ముఖేశ్ అంబానీకి గాని ఎలాంటి పాత్ర లేదని చెబుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ముఖేశ్ పై కేసు నమోదు చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. దుర్గాంబ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రిలయన్స్, ముఖేశ్ అంబానీ, నారాయణరావుతో పాటు కాకినాడ వన్ టౌన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.