: ఐఎస్ వీడియోలో డాక్టర్... ఆందోళనలో ఆస్ట్రేలియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) విడుదల చేసిన ఓ వీడియో ఆస్ట్రేలియా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ వీడియోలో కనిపించిన ఓ వైద్యుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడమే వారి ఆందోళనకు కారణం. ఆ వీడియోలో, అబూ యూసఫ్ అనే డాక్టర్ తాను సిరియాలోని రఖా నగరానికి వచ్చానని, ఐఎస్ కు వైద్య సేవలు అందించాలన్నదే తన అభిమతమని చెప్పడం చూడొచ్చు. అంతేగాదు, అధిక సంఖ్యలో వైద్య నిపుణులు ఐఎస్ లో చేరాలని కూడా అతడు పిలుపునిచ్చాడు. ఆ వీడియోలో యూసఫ్ అని చెప్పుకుంటున్న వ్యక్తి వాస్తవానికి తారిఖ్ కమ్లీ అని, అతడు అడిలైడ్ లో వైద్య విద్యను అభ్యసించాడని ఆస్ట్రేలియన్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి జూలీ బిషప్ మాట్లాడుతూ... 100 మందికి పైగా ఆస్ట్రేలియా జాతీయులు ఐఎస్ తో చేతులు కలిపారని, తాజాగా ఓ వైద్యుడు కూడా వారితో జతకలవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఐఎస్ ప్రజలకు సాయపడదని, ఉగ్రవాద సంస్థలకే చేయూతనందిస్తుందని, ముస్లిం, ముస్లిమేతర ప్రజలను చంపుతుందని ఆమె విమర్శించారు.