: ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతం!
ఉగ్రవాదులపై అమెరికా సైన్యం మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. గత నెలలో అమెరికా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఇరాన్ రేడియో వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా రేడియో న్యూస్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా స్పష్టం చేసింది. కాగా, గత వారంలో గార్డియన్ పత్రిక కథనం ప్రకారం, అబూ బకర్ కు తిరిగి కోలుకోలేనంతగా గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి బకర్ తన రోజువారీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు. కాగా, బాగ్దాదీ మరణంపై ఐఎస్ఐఎస్ తన అధికారిక స్పందనను తెలియజేయాల్సి వుంది. గత సంవత్సరం జూలైలో ఒక మసీదు వద్ద ప్రసంగించిన అబూ బకర్ ఆపై బహిరంగంగా కనిపించలేదు. ఆయన తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 64 కోట్లు) బహుమానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.