: నేపాల్ భూకంపం 20 అణుబాంబులకు సమానమట!
నేపాల్ లో సంభవించిన భూకంపం వేల మంది ప్రాణాలను బలిగొనడం ప్రపంచ దేశాలను కలచివేసింది. ఏళ్లుగా నేపాల్ ను ఎన్నో భూకంపాలు కుదిపేస్తున్నా, తాజా ఉపద్రవం మాత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఎవరెస్ట్ అంతటి సమున్నత శిఖరరాజం కూడా ఈ భూకంపం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైంది. నేపాల్ గడ్డపై గత 80 ఏళ్లలో ఇదే అతి భారీ భూకంపం. ఇది 20 థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబులకు సమానమని పరిశోధకులు అంటున్నారు. భూమికి 10 నుంచి 15 కిలోమీటర్ల లోతులోనే భూకంపం సంభవించడంతో తీవ్రత ఎక్కువగా కనిపించిందని తెలిపారు. అందుకే భూమి కుదుపులు వేగంగా చోటుచేసుకున్నాయని వివరించారు.