: వేధిస్తున్న కొడుకును కిరాయిచ్చి చంపించిన తల్లిదండ్రులు... చిత్తూరు జిల్లాలో సంచలనం
అందివస్తాడని, ఆదుకుంటాడని వేలకు వేలు పోసి చదివిస్తుంటే, బాధ్యతలు మరచి నిత్యమూ మద్యం సేవించి వేధిస్తున్న కొడుకును చేజేతులా చంపుకోలేక, కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించారో తల్లిదండ్రులు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం దిగువ సాంబయ్యపాల్యంలో సంచలనం సృష్టించింది. హత్య అనంతరం తల్లిదండ్రులు పోలీసు స్టేషనుకు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టీటీడీ సులభ్ కాంప్లెక్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న మునికృష్ణ, తన భార్య, బీటెక్ చదువుతున్న కొడుకు రాంబాబు (22)తో కలసి తిరుపతిలో నివసిస్తున్నాడు. నిత్యమూ తాగి వేధిస్తున్న రాంబాబు ఇక తమకు అక్కర్లేదని భావించిన మునికృష్ణ నిన్న సాయంత్రం సమీపంలోని ఎంజీఎం క్రషర్ వద్దకు కొడుకును తీసుకువెళ్లారు. ఆ తరువాత రాంబాబు అక్కడ శవమై కనిపించాడు. తామే కొడుకును హత్య చేయించామని శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట మునికృష్ణ దంపతులు లొంగిపోగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరాయి హంతకులను అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు.