: రేవంత్ రెడ్డికి పగ్గాలివ్వండి... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పోస్టర్ల కలకలం
తెలంగాణలో యువనేత రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించాలని బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పోస్టర్లు అతికించడం ఈ ఉదయం కలకలం రేపింది. "జై తెలుగుదేశం, జై తెలంగాణ, చంద్రబాబు గారూ! రేవంత్ రెడ్డి గారికి టి.టీడీపీ బాధ్యతలను అప్పగించండి - తెలుగుయువత" అని రాసిన నాలుగు పోస్టర్లు నోటీసు బోర్డుపై దర్శనమిచ్చాయి. దీనిపై తెలుగుదేశం నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయమై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, తన ప్రమేయం లేకుండా ఎవరో అభిమానులు ఈ పని చేసి వుంటారని, ఈ తరహా చర్యలు తగదని అన్నారు. ఎవరికి ఏ పదవులు ఎప్పుడు అప్పగించాలో తమ నేత చంద్రబాబుకు తెలుసునని, రేవంత్ రెడ్డికి మేలు చేయాలని భావించేవారు ఇటువంటి పనులు చేయరని వ్యాఖ్యానించారు. ఈ పద్ధతి సరైనది కాదని, పార్టీకి మంచిది కాదని అన్నారు. ఈ పోస్టర్లను అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ నేత ఆదేశిస్తే అదనపు బాధ్యతలు అప్పగిస్తే స్వీకరిస్తానని, ఈ తరహాలో తెల్ల కాగితాలపై చిత్తు రాతలు రాస్తే పనులు జరగవని వివరించారు. తెలంగాణ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లితో తనకు విభేదాలు లేవని, తామంతా కలిసే పనిచేస్తున్నామని తెలియజేశారు.