: పేరు మార్చుకున్న బోకో హరామ్... ఇకపై 'ఇస్వాప్' అట!
ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. నైజీరియాలో మారణహోమం సృష్టిస్తున్న బోకో హరామ్ ను విలీనం చేసుకుంది. దీంతో బోకో హరామ్ తన పేరును ఇస్లామిక్ స్టేట్స్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ఐఎస్ డబ్ల్యుఏపీ-ఇస్వాప్)గా మార్చుకున్నట్టు తెలుస్తోంది. గత నెలలో ఐఎస్ఐఎస్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాము సిద్ధమేనని బోకో హరామ్ చీఫ్ అబూ బకర్ షీకూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి బోకో హరామ్ అంటే 'పశ్చిమ దేశాల విద్యను మరచిపోవాలి' అనే అర్థం వస్తుంది. ప్రస్తుతం ఈ ఉగ్ర సంస్థలో 15 వేల మందికిపైగా సభ్యులున్నారు. కాగా, ఈ పేరు మార్పుపై బోకో హరామ్ అధికారిక స్పందన వెలువడాల్సి వుంది.