: కొడుకు పెళ్లి ఆర్భాటంతో సంపన్నుల జాబితాలో దిగజారిన హిందూజాలు
బ్రిటన్ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న భారత పారిశ్రామిక దిగ్గజాలు హిందూజాలకు ఈ ఏడాది షాక్ తగిలింది. సండే టైమ్స్ మేగజీన్ వెలువరించిన తాజా జాబితాలో హిందూజాలు రెండో స్థానానికి దిగజారారు. సుదీర్ఘకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న వీరు రెండో స్థానానికి దిగజారిన కారణం తెలిస్తే ఆశ్చర్యకపోక తప్పదు. ఇటీవల ముంబైలో కొడుకు పెళ్లి కోసం హిందూజాలు 1.5 కోట్ల పౌండ్ల మేర దుబారా చేశారు. అంతేకాక రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ కు చెందిన భారత్ లోని జువెలరీ, వజ్రాల ఫైనాన్సింగ్ వ్యాపారం కొనుగోలుకు హిందూజాలు భారీగానే వ్యయం చేశారు. ఈ రెండు కారణాలే హిందూజాలను జాబితాలో కిందకు దిగజార్చాయని ఆ మేగజీన్ తెలిపింది. ఉక్రెయిన్ కు చెందిన సంగీత సామ్రాట్ లెన్ బ్లవట్నిక్, హిందూజా సోదరులను రెండో స్థానానికి దిగజార్చి అగ్రస్థానానికి ఎగబాకారు. అయితే లెన్, హిందూజాల సంపద మధ్య అంతరం కేవలం 17 కోట్ల పౌండ్లేనట. 1,300 కోట్ల పౌండ్ల సంపదతో హిందూజా సోదరులు రెండో స్థానంలో ఉండగా, 1,317 కోట్ల పౌండ్లతో లెన్ అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఉక్కు దిగ్గజం లక్ష్మీనివాస్ మిట్టల్ స్థానం కూడా జాబితాలో మూడు నుంచి ఏడుకు దిగజారింది.