: జూలు విదిల్చిన బెంగళూరు... ఢిల్లీపై 10 వికెట్ల తేడాతో రికార్డు విక్టరీ


ఐపీఎల్-6లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ జట్టు నిన్న రాత్రి రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఆ జట్టు బౌలర్లు సత్తా చాటితే, ఆ తర్వాత బ్యాట్స్ మెన్ జూలు విదిల్చారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బెంగళూరు బౌలర్లు మైఖేల్ స్టార్క్, వరుణ్ ఆరోన్, డేవిడ్ వీస్ లు బంతితో రాణించి ఢిల్లీ టాపార్డర్ ను కుప్పకూల్చారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (27), కీపర్ కేదార్ జాదవ్ (33)లు మినహా ఢిల్లీ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. భారీ అంచనాలతో క్రీజులో అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ (2) నిరాశపరిచాడు. ఈ క్రమంలో కేవలం 95 పరుగులు చేసిన ఢిల్లీ 18.2 ఓవర్లలోనే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత 96 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు వికెట్ నష్టపోకుండానే టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (62), కెప్టెన్ విరాట్ కోహ్లీ (35) చెలరేగారు. వచ్చీరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డ వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో 10.3 ఓవర్లలోనే 99 పరుగులు రాబట్టిన బెంగళూరు, సునాయాసంగానే రికార్డు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

  • Loading...

More Telugu News