: సాక్షాత్తూ నేపాల్ అధ్యక్షుడు కూడా టెంట్ లోనే గడిపారు
నేపాల్ ను భూకంపం మరుభూమిగా మార్చేసింది. భూకంపం ధాటికి పేద ధనిక తేడా లేకుండా రోడ్డున పడ్డారు. సాక్షాత్తూ నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ రాత్రంతా టెంటులో జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 2200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడిన ఈ ఘటనలో పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. సాక్షాత్తూ నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ అధికారిక నివాసంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో గత రాత్రంతా ఆయన తన భద్రత సిబ్బందితో కలసి టెంట్ లో ఆరుబయట బస చేశారు. నేపాల్ ప్రెసిడెంట్ నివాసం 'శీతల్ నివాస్' ను 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనంలో వంటగదితో పాటు ఇతర గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. కాగా, ప్రధాని సుశీల్ కొయిరాలా నివాసం ప్రధాన ద్వారం భూప్రకంపనలకు దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఆయన ఇండోనేసియా పర్యటనలో ఉన్నారు.