: ఐక్యరాజ్యసమితిపై మండిపడిన హాలీవుడ్ హీరోయిన్
ఐక్యరాజ్యసమితిలో ఐక్యరాజ్యసమితిపై ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ మండిపడింది. ఐక్యరాజ్యసమితి కాందిశీకుల ప్రత్యేక రాయబారి హోదాలో భద్రతా మండలి నిర్లిప్తతపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఐదేళ్లుగా సిరియాలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రయత్నం చేయడంలేదని ఆరోపించింది. సిరియా సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వినియోగించడం లేదని, సమస్యకు చరమగీతం పాడాలన్న రాజకీయ సంకల్పం ఐక్యరాజ్యసమితికి లేదని ఆమె ధ్వజమెత్తింది. ఈ ఐదేళ్ల సంక్షోభంలో రెండు లక్షల 20 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, సుమారు పది లక్షల మందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఆమె వెల్లడించింది. సుమారు 76 లక్షల మంది ప్రజలు నివాస స్థలాలు వదిలి శరణార్థులుగా తరలిపోయారని జోలీ ఆవేదన వ్యక్తం చేసింది. వారిలో సుమారు 40 లక్షల మంది ప్రజలు శరణార్థులుగా ఉండేందుకు అనర్హులంటూ తిరస్కరించబడ్డారని ఆమె పేర్కొంది. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న సంకల్పం ఐక్యరాజ్యసమితికి లేకపోవడం వల్లే అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆమె తెలిపింది. ఇప్పటికైనా స్పందించి, పరపతి, అధికారాలు ఉపయోగించి సమస్యను పరిష్కరించి, సిరియన్లకు న్యాయం చేయాలని జోలీ విజ్ఞప్తి చేసింది.