: నీతూ నోటి వెంట ‘ఎర్ర’ స్మగ్లర్ల పేర్లు... మరికాసేపట్లో మీడియా ముందుకు ‘రెడ్’ హీరోయిన్!


ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ ను కర్నూలు జిల్లా పోలీసులు మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నేతల ప్రమేయమున్న ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన ఏపీ పోలీసులు, ఇటీవల పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేత, కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలీని అరెస్ట్ చేసిన పోలీసులు నీతూ అగర్వాల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించి, ఆమె పాత్రను నిర్ధారించుకున్నారు. వెనువెంటనే రంగంలోకి దిగిన కర్నూలు జిల్లా ఎస్పీ రవి కృష్ణ, నీతూపై రుద్రవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించిన ఆయన నిన్న రాత్రి నీతూను హైదరాబాదులో అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రే కర్నూలు తరలించిన ఆమెను పలు కోణాల్లో విచారించిన ఆయన పలువురు కీలక స్మగ్లర్ల పేర్లను రాబట్టినట్లు సమాచారం. నేటి ఉదయం 11 గంటలకు నీతూను మీడియా ముందు ప్రవేశపెట్టనున్న రవికృష్ణ, ఆమె నోటి నుంచే కీలక నిందితుల పేర్లను బయటపెట్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News