: బీఎస్ఎన్ఎల్ ఔదార్యం... మూడు రోజుల పాటు నేపాల్ కు లోకల్ కాల్ రేట్లు
భారీ భూకంపం నేపాల్ లో బీభత్సం సృష్టించిన నేపథ్యంలో, భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఔదార్యం ప్రదర్శించింది. మూడు రోజుల పాటు నేపాల్ కు చేసే కాల్స్ కు లోకల్ కాల్ చార్జీలు వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ సౌకర్యం ద్వారా, నేపాల్ లో చిక్కుకున్న తమ వారితో భారత్ వాసులు అధిక సమయం మాట్లాడేందుకు వీలు కలుగుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనికి ఆమోదం తెలుపగా, ఆ శాఖ క్యాబినెట్ సెక్రటరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మామూలుగా నేపాల్ కు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ నుంచి నిమిషానికి రూ.10 వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో లోకల్ కాల్ చార్జీతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు నేపాల్ లో ఉన్న తమవారికి ఫోన్ చేయవచ్చని సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.